'రమ్మీ' చిత్రం టైటిల్ ను 12 లక్షల రూపాయలకు బేరం పెట్టాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదనీ, 'కేడీ' చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ సమయంలో హీరో నాగార్జున చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయనీ 'హైనెక్ కలర్స్' బ్యానర్ అధినేతలు తీవ్రంగా ఖండించారు. 'కేడీ' చిత్రం టైటిల్ ను కామాక్షి కళా మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి సోమవారంనాడు ప్రకటించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ, ఈ చిత్రానికి 'రమ్మీ' అనే టైటిల్ ను అనుకున్నామనీ, అయితే ఆ టైటిల్ వేరే వాళ్ల దగ్గర ఉందని తెలిసి అడిగినప్పుడు 12 లక్షలు డిమాండ్ చేశారనీ పేర్కొన్నారు. ఇలాంటి విషయాల్లో నిర్మాతల మండలి, చలనచిత్ర మండలి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నాగార్జున అభిప్రాయపడ్డారు. నాగార్జున వ్యాఖ్యలను 'రమ్మీ' చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేంద్ర హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో మంగళవారంనాడు ఖండించారు.'రమ్మీ' చిత్రాన్ని శివాజీ కథానాయకుడుగా శరత్ చంద్ర దర్శకత్వంలో తీసేందుకు తాము ప్లాన్ చేశామనీ, అయితే శరత్ చంద్ర ఆకస్మిక మరణంతో ఆ ప్రాజెక్ట్ కొంత డిలే అయిందనీ సురేంద్ర తెలిపారు. కామాక్షి మూవీస్ నుంచి ఒక వ్యక్తి ఆమధ్య తమ వద్దకు వచ్చిన మాట నిజమేనని అన్నారు. ఆయన టైటిల్ అడిగినప్పుడు తాము సినిమా తీస్తున్న విషయాన్ని, దర్శకుడు శరత్ చంద్ర మరణంతో మరో దర్శకుడితో ప్రాజెక్ట్ ప్రారంభించాలనుకుంటున్న విషయాన్ని ఆయనకు చెప్పి టైటిల్ ఇవ్వడానికి నిరాకరించామని అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే టైటిల్ కోసం 12 లక్షలు అడిగినట్టు నాగార్జున చెప్పడం సమంజసం కాదని అన్నారు. ఆయన వ్యాఖ్యలు తమను బాధించాయనీ, నాగార్జున గానీ, చిత్ర నిర్మాత శివప్రసాద్ రెడ్డి కానీ తమను ఎప్పుడూ ఎప్రోచ్ కాలేదనీ పేర్కొన్నారు. టైటిల్ ను అమ్ముకోవాల్సిన అగత్యం తమకు ఎంతమాత్రం లేదన్నారు. టైటిల్ బిజినెస్ కోసం తాము పరిశ్రమలోకి రాలేదనీ, అమెరికాలో తమకు వ్యాపార సంస్థలు, మంచి బ్యాక్ గ్రౌండ్ ఉందని స్పష్టం చేశారు. 'రమ్మీ' రగడపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయాలనే ఆలోచన కూడా ఉందని చెప్పారు. సురేంద్ర తో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సోమేశ్వరరావు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు
No comments:
Post a Comment