'థియేటర్లు మూసేయండి'

'మొన్న నా సినిమాలను అడ్డుకుని ఆపేయించారు. ఎగ్జిబిటర్లు థియేటర్లు మూసేశారు. నిన్న నా సినిమా షూటింగ్ పైనా దాడి చేశారు. అయినా ఫరవాలేదు. ఒకటే చెప్పదలచుకున్నాను. ఇక్కడే ఎందుకు మూసేయాలి? ఆంధ్రాలోనూ నా సినిమాలను ఆపేయమని ఎగ్జిబిటర్లకు చెప్పండి. ఇదేదో మోహన్ బాబు ఒక్కడి సమస్య అనుకున్న పరిశ్రమ వాళ్లు ఇప్పటికైనా కళ్లు తెరుచుకోండి. నిన్న నా కూతురు అయింది. ఇవాళ బన్నీ బాబు అయ్యాడు. రేపు మీ వంతు రాబోతోంది' అంటూ ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సినీ పరిశ్రమ పెద్దలకు చురకలు వేశారు. 'వరుడు' సినిమా షూటింగ్ ను బుధవారం ఉదయం తెరాస, ఎబివిపి శ్రేణులు అడ్డుకుని యూనిట్ ను భయభ్రాంతులను చేసి విధ్వంసం సృష్టించిన ఘటనపై మోహన్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.లక్ష్మీప్రసన్న షూటింగ్ చేస్తున్న ప్రాంతంలో ముష్కరులు విధ్వసం సృష్టించినప్పుడు ఆ ఇంటి పక్కనే ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కనీసం స్పందించక పోవడం విడ్డూరమని అన్నారు. నిన్నటి సంఘటన తర్వాత స్పందించి ఉంటే ఇవాళ బన్నీ (అల్లు అర్జున్) వంతు వచ్చేది కాదని అన్నారు. బన్నీ తన కుమారుడు వంటి వాడనీ, అలాగే మనోజ్-లక్ష్మీప్రసన్న షూటింగ్ పై జరిగిన దాడిని చిరంజీవి ఖండించడం తనకెంతో సంతోషంగా ఉందనీ అన్నారు. ఇప్పటికైనా ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, 'మా' స్పందించకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ప్రవర్తిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

No comments:

Post a Comment