క్రియేటివ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ కథానాయకుడుగా ఓ కొత్త చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి ప్రకటించారు. రవిసదాశివుని సమర్పణలో కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ పై అల్లరి నరేష్ మాట్లాడుతూ, వంశీ దర్శకత్వంలో నటించాలనే కోరిక తనకు చాలాకాలంగా ఉందనీ, ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుండటం చాలా సంతోషంగా ఉందనీ అన్నారు. వెండితెరపై వినోదాన్ని పంచడంలో వంశీది ఓ ప్రత్యేకమైన శైలి అనీ, తమ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం కచ్చితంగా నవ్వుల విందు భోజనం వడ్డిస్తుందనీ చెప్పారు. ఎం.ఎల్.కుమార్ చౌదరి మాట్లాడుతూ, 'గోపి గోపిక గోదావరి' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత వంశీ చేస్తున్న చిత్రమిదనీ, అల్లరి నరేష్ 'బెండు అప్పారావు ఆర్ఎంపి' విజయంతో మంచి స్పీడ్ లో ఉన్నారనీ చెప్పారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయనీ, ఆ అంచనాలను మించే విధంగా ఈ సినిమా ఉంటుందనీ తెలిపారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిదని తెలిపారు. అలాగే వంశీ-సంగీత దర్శకుడు చక్రి కాంబినేషన్ లో పలు మ్యూజికల్ హిట్స్ వచ్చాయనీ, ఇప్పుడు ఆ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించనుందనీ తెలిపారు. ఫిబ్రవరిలో సినిమా ప్రారంభోత్సవం ఉంటుందనీ, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు.
No comments:
Post a Comment