ఎన్టీఆర్ ఆత్తగా శ్రీదేవి!

బాలనటిగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి మూడు తరాల హీరోలతో నటించి...బాలీవుడ్ లో సైతం ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి శ్రీదేవి వివాహానంతరం నటనకు దూరంగా ఉంటున్నారు. చాలాకాలం తర్వాత మళ్లీ ఆమెను తెలుగులో నటింపజేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీదేవి కథానాయికగా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' వంటి సెన్సేషన్ హిట్ ఇచ్చిన వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ నిర్మించనున్న కొత్త చిత్రంలో శ్రీదేవిని ఓ కీలక పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించనున్నారు. ఎన్టీఆర్ తో 'కంత్రి' తో న్యూలుక్ ఇచ్చిన మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనికి 'శక్తి' అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది.నటరత్న ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకూ పలువురు అగ్ర హీరోలతో 3 దశాబ్దాలుగా భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న అశ్వనీదత్ ఈ చిత్రాన్ని సైతం 45 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే యూత్ లో క్రేజీ హీరోయిన్ గా పేరున్న ఇలియానాను ఎన్టీఆర్ కు జోడిగా ఎంపిక చేశారు. ఇలియానాకు తల్లి పాత్రలో శ్రీదేవిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో 'అల్లరి రాముడు' చిత్రంలో ఎన్టీఆర్ అత్త పాత్రకు శ్రీదేవిని అనుకున్నప్పటికీ అది కార్యరూపంలోకి రాలేదు. ఆ పాత్రను నగ్మా పోషించారు. సీనియర్ ఎన్టీఆర్ తోనూ, అశ్వనీదత్ బ్యానర్ తోనూ తనకున్న అనుబంధం దృష్ట్యా ఈసారి ఎన్టీఆర్ అత్త పాత్రను శ్రీదేవి అంగీకరించే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా బాలీవుడ్ నటి అమృతారావు పేరు పరిశీలనలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 14 లొకేషన్లలో ఈ చిత్రాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది.

No comments:

Post a Comment