హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కథానాయకుడుగా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మీప్రసన్న పిక్చర్స్ నిర్మిస్తున్న షూటింగ్ ను తెరాస శ్రేణులు మంగళవారంనాడు అడ్డుకుని స్వైరవివాహారం చేశారు. చెప్పులు, రాళ్లురువ్వి షూటింగ్ ను అడ్డుకున్నారు. శివార్లలోని కొంపల్లి వద్ద ఒక ఇంటిలో షూటింగ్ జరుగుతుండగా తెరాస శ్రేణులు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఆందోళనకారులు షూటింగ్ స్పాట్ లోకి వచ్చి యూనిట్ సభ్యులను, షూటింగ్ లో పాల్గొంటున్న పలువురు చిన్నపిల్లలను చిదకబాదారనీ, పోలీసుల కళ్లముందే ఇది జరుగుతున్నా వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారనీ, తమను భయభ్రాంతులను చేశారని లక్ష్మీప్రసన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంచు మనోజ్, బ్రహ్మానందం, హీరోయిన్ , పలువురు ఆర్టిస్టులు, చిన్నారులు షూటింగ్ లో పాల్గొంటున్న తరుణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.దాడి సంఘటనపై లక్ష్మీప్రసన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, పోలీసు వాళ్లలో కూడా కొందరు ఇలాంటి వాళ్లతో చేతులు కలిపారనీ, మహేష్ గౌడ్ అనే పోలీసు ఆఫీసర్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారనీ తెలిపారు. నాన్నగారు లేని సమయంలో ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడ్డారని ఆమె వాపోయారు. ఒకరు తన చేయి కూడా పట్టుకున్నారనీ, అన్యాయంగా చిన్నపిల్లలని కూడా చూడకుండా విసిరేశారనీ ఆమె తెలిపారు. తాము రోడ్డు మీద షూటింగ్ చేసుకోలేదనీ, డైలీ ఇంతని చెల్లించి పర్మిషన్ తీసుకుని మరీ ఒక ఇంట్లో షూటింగ్ చేసుకుంటున్నామనీ ఆమె తెలిపారు. ముష్కరులు తమ సినిమా కెమెరాలు పగులకొట్టారనీ, యూనిట్ కు కొట్టారనీ, దాదాపు లక్షన్నర రూపాయల కెమెరాను పగులకొట్టి కెమెరామన్ ను చితగొట్టారనీ ఆమె వాపోయారు. 2010లో తాము ఉన్నామనీ, ఒక ఉద్యోగం కోసమో, చదువు కోసమే మనం రోడ్కెక్కి ఉంటే ఎప్పుడో బాగుపడేవాళ్లమనీ ఆమె ఆందోళనకారులకు చురకలు అంటించారు. ఆంధ్రప్రదేశ్ అంటే, హైదరాబాద్ అంటే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వరకూ ఏమిటో తెలిసేదనీ, ఇప్పుడు అందరి ముందూ చులకనయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దాడి సంఘటన అనంతరం షూటింగ్ స్పాట్ కు చేరుకున్న మోహన్ బాబు ఈ దాడిని తీవ్ర స్థాయిలో ఖండించారు.
No comments:
Post a Comment