ఎన్టీఆర్ కథానాయకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'అదుర్స్' చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 25న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. క్రిస్మస్ రోజునే సినిమా విడుదల చేస్తున్నట్టు నిర్మాతల వల్లభనేని వంశీ, కొడాలి నాని డిస్ట్రిబ్యూటర్లకు తెలియజేసినట్టు సమాచారం. దాదాపు 1000 ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించిన కీలకమైన డిజిజల్ ఇంటర్మీడియట్ వర్క ముంబైలో జరుగుతోంది. ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ దర్శకుడు వి.వి.వినాయక్ కడప జిల్లాలోని అమీర్ పీర్ దర్గాను మంగళవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.'అదుర్స్' చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. అగ్రహారంలో ఉండే బ్రాహ్మణ యువకుడిగా, డాన్ గా ఈ రెండు పాత్రలు ఉండబోతున్నాయి. సినిమా ప్రథమార్థం హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తోనూ, ద్వితీయార్థం యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలతోనే వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులోని ఒక పాత్రను ఎవరైనా చేయగలుగుతారనీ, రెండో పాత్రను ఎన్టీఆర్ మాత్రమే చేయగలడనిపించేలా ఆయన నటన అదర్స్ అనిపిస్తుందనీ వినాయక్ చెబుతున్నారు. ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా కథానాయకులుగా నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో ఇటీవలే విడుదలై మంచి ఆదరణ చూరగొంటోంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మహేష్ మంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘబాబు, తనికెళ్ల భరణి, రమాప్రభ, రాజ్యలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. కోన వెంకట్ కథ-మాటలు, చంద్రబోస్ పాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఆనంద్ సాయి ఆర్ట్, స్టన్ శివ-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు.
No comments:
Post a Comment