వివాదంలో 'మహాత్మ' పాట

శ్రీకాంత్ 100వ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా కృష్ణవంశీ తెరకెక్కించిన 'మహాత్మ' చిత్రం ఇప్పటికే సెన్సార్ చిక్కులను ఎదుర్కొని రిలీజ్ తేదీని కూడా ఒకసారి వాయిదా వేసుకుంది. 'ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ' అనే పాటలోని కొన్ని సన్నివేశాలతో సహా పలు కట్స్ ను సెన్సార్ సూచించడతో చివరకు రివైజింగ్ కమిటీకి వెళ్లింది. దీంతో ఈనెల 2న విడుదల కావాల్సిన 'మహాత్మ' చిత్రం 9వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు సెన్సార్ కూడా పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో మరో వివాదం చుట్టుకుంది. 'మగధీర' చిత్రంలోని పాట తనదేనంటూ వంగపండు వివాదం రేపిన తరహాలోనే 'మహాత్మ'లోని 'నీలంపురి గాజులు' అనే పాట తన ఆల్బమ్ లోనిదంటూ అవుదుర్తి లక్ష్మణ్ క్లెయిమ్ చేశారు. 'మహాత్మ' ఆడియోలోని ఏడవ సాంగ్ ఇది.నాలుగేళ్ల క్రితం తాను చేసిన ఆల్బమ్ లోని పాట ఇదనీ, తన అనుమతి లేకుండా 'మహాత్మ' మేకర్స్ ఆ పాటను వాడుకోవడం కాపీ రైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. సినిమాలోని సదరు పాటను శ్యాం అండ్ గ్రూప్ పాడారు. తనను సంప్రదించకుండా పాటను వాడుకున్నందుకు గాను దర్శకనిర్మాతలు, సింగర్లు తక్షణం తనకు క్షమాపణ చెప్పాలని, అలా కాని పక్షంలో కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందనీ ఆయన కన్నెర్ర చేస్తున్నారు. అయితే పల్లెప్రజలు అలసట తెలియకుండా నాట్లు వేసుకుంటూ పాడుకునే పాటను తనదేనంటూ లక్ష్మణ్ పేర్కొనడం సముచితం కాదని 'మహాత్మ' గేయ రచయిత కాసర్ల శ్యాం అంటున్నారు. అసలే ఒకసారి విడుదల తేదీ వాయిదా పడి...ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర వరద బాధిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ అవుతుండటంపై కొంత బెంగ పెట్టుకున్న చిత్ర నిర్మాతలకు తాజా వివాదం గోరుచుట్టు మీద రోకటి పోటే కావచ్చు...

No comments:

Post a Comment