'నర్తనశాల'కు బాలయ్య సై!

నటరత్న ఎన్టీఆర్ నటవారసుడుగా పౌరాణిక పాత్రలు పోషించి మెప్పించగల సామర్థ్యం, అందుకు తగిన ఆహార్యం, వాచికం నందమూరి బాలకృష్ణ సొంతం. రాముడు, కృష్ణుడు, దుష్యంతుడు, అభిమన్యుడు, నారదుడు వంటి పలు పౌరాణిక పాత్రలను గతంలో పోషించిన బాలకృష్ణ ఇటీవలే 'పాండురంగడు' చిత్రంలో కృష్ణుడు పాత్ర పోషించి తన తండ్రిని తలపించారు. ఎన్టీఆర్ 'పాండురంగ మహాత్మ్యం' చిత్రానికి రీమేక్ గా ఆ చిత్రం రూపొందింది. ప్రస్తుతం ఎన్టీర్ క్లాసిక్ 'నర్తనశాల' పై బాలకృష్ణ దృష్టిసారించబోతున్నారు. నిజానికి 'నర్తనశాల' చిత్రాన్ని బాలకృష్ణ కొద్దికాలం క్రితమే స్వీయ దర్శకత్వంలో శ్రీకారం చుట్టారు. కొంత షూటింగ్ కూడా జరిగిన తర్వాత తర్వాత సినిమా ఆగిపోయింది. ద్రౌపతి పాత్రధారిణి సౌందర్య అకాలమరణం ఇందుకు ఓ కారణం. ఆ తర్వాత క్రమంలో బాలకృష్ణ కాలికి తీవ్రగాయమై మూడు నెలలు రెస్ట్ తీసుకోవాల్సింది. సౌందర్య ప్లేస్ లో గ్రేసీసింగ్ నటించబోతోందంటూ ప్రచారం జరిగినా అది కూడా కార్యరూపంలోకి రాలేదు. బాలకృష్ణ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆ చిత్రంలో అర్జునుడు, కృష్ణుడు, కీచకుడిగా త్రిపాత్రాభినయం చేయాలనుకున్నారు. వారం రోజుల షెడ్యూల్ కూడా పూర్తయిన తర్వాత వరుస సమస్యలు తలెత్తి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పట్నించీ మళ్లీ 'నర్తనశాల ఊసే లేదు. తాజాగా ఈ చిత్రానికి కదలిక రాబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల ముచ్చట. అత్యున్నత సాంకేతిక విలువలతో ఇటీవల విడుదలైన 'మగధీర' సంచలన విజయం సాధించడంతో బాలకృష్ణ తిరిగి 'నర్తనశాల' చిత్రాన్ని పట్టాల మీదకు తీసుకు వచ్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు సమాచారం. 'మగధీర' టెక్నికల్ టీమ్ నే ఈ చిత్రానికి కూడా ఎంచుకుని ఈ చిత్రాన్ని ముందుకు తీసుకు వెళ్లాలనే పట్టుదలతో ఆయన ఉన్నారట. ద్రౌపతి పాత్రకు 'పాండురంగడు' చిత్రంలో తనకు జోడిగా నటించిన స్నేహను అనుకుంటున్నారట. అన్నీ కలిసి వస్తే 'సింహా' చిత్రం తర్వాత బాలకృష్ణ సొంత ప్రాజెక్ట్ 'నర్తనశాల' తెరకెక్కవచ్చు. 2010 సంక్రాంతి కానుకగా 'సింహా' విడుదలవుతుంది.

No comments:

Post a Comment