'రాముడు-భీముడు' రీమేక్

నాలుగున్నర దశాబ్దాలుగా శతాధిక చిత్రాలను నిర్మించిన మూవీమొఘల్ డాక్టర్ డి.రామానాయుడు తన కెరీర్ కు, బ్యానర్ కు తొలి విజయాన్ని అందించిన 'రాముడు-భీముడు' చిత్రాన్ని మాత్రం ఇప్పటికీ ఘనంగా చెప్పుకుంటారు. నటరత్న ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రానికి తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. 1964లో ఈ చిత్రం విడుదలై సురేష్ బ్యానర్ కు మంచి పేరు తెచ్చింది. రామానాయుడు తొలిసారి నిర్మించిన చిత్రం, ఎన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేసేందుకు రామానాయుడు సన్నాహాలు చేస్తున్నారు. నందమూరి మూడోతరం వారసుడుగా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇందులో కథానాయకుడుగా నటించబోతోన్నారు.రామానాయుడు తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ముచ్చటిస్తూ, 'రాముడు-భీముడు' సినిమా ఇప్పుడు తీసినా చాలా యాప్ట్ గా ఉంటుందనీ, యువ ఎన్టీఆర్ తో తాను ఈ విషయమై సంప్రదించాననీ, ఆయన కూడా సానుకూలంగా స్పందించారనీ చెప్పారు. సురేష్ బ్యానర్ కు చాలా పెద్ద హిట్ ఇచ్చిన 'ప్రేమ్ నగర్' చిత్రాన్ని కూడా రీమేక్ చేయాలనే బలమైన కోరిక ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో సురేష్ బ్యానర్ కు కొద్దిపాటి ఫ్లాపుల్ వచ్చినప్పటికీ మళ్లీ ఇదే బ్యానర్ నుంచి ఇటీవల విడుదలైన 'బెండు అప్పారావు ఆర్ఎంపి' సక్సెస్ నమోదు చేసుకుంది. దీంతో రామానాయుడు సైతం రెచ్చించిన ఉత్సాహంలో ఉన్నారు. అన్నీ కలిసి వస్తే 'రాముడు-భీముడు' చిత్రాన్ని యంగ్ ఎన్టీఆర్ తో రీమేక్ చేయాలనే కోరిక కూడా వచ్చే ఏడాది తీరవచ్చు. అన్నట్టు...నందమూరి బాలకృష్ణ నటించగా కె.మురళీమోహన్ దర్శకత్వంలో 1988లో సైతం ఓ 'రాముడు-భీముడు' చిత్రం వచ్చింది. రాముడైనా...భీముడైనా నందమూరి హీరోలకే చెల్లిందేమో?!

No comments:

Post a Comment