'లీడర్' రాక డిసెంబర్ 21

తెలుగు సినిమాను దశాబ్దాల పాటు ఏలుతున్న నాలుగు అగ్ర కుటుంబాల నుంచి వస్తున్న కొత్తతరం వారసుల్లో ఇప్పుడు దగ్గుబాటి రానా వంతు వచ్చింది. డాక్టర్ డి.రామానాయుడు మనువడైన రానాను కథానాయకుడుగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ నిర్మిస్తున్న 'లీడర్' చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటూ డిసెంబర్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.ఇవాల్టి సమకాలీన రాజకీయ నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొనే లీడర్ ఎలా ఉండాలనే కథాంశంతో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంతవరకూ ప్రేమకథా ఇతివృత్తాలనే ఎంచుకుంటూ వచ్చిన శేఖర్ కమ్ముల తొలిసారి పొలిటికల్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటం ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'ఆనంద్' తనకు కూతురు అయితే, 'హ్యాపీడేస్' తన కొడుకు అనీ, 'లీడర్' తల్లిలాంటిదనీ శేఖర్ కమ్ముల చెబుతున్నారు. తాను ఇంతవరకూ తీసిన చిత్రాలతో పోలిస్తే 'లీడర్' చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉంటుందనీ ఆయన అంటున్నారు. నిష్కలంక రాజకీయాలు, ప్రజా శ్రేయస్సు కోరుకునే లీడర్ ఎలా ఉండాలో ఇందులో ఆయన చూపించారు. ఈ చిత్రం నటరత్న ఎన్టీఆర్ స్ఫూర్తితో తీశారనీ, హాలీవుడ్ 'గాడ్ ఫాదర్'కు దగ్గరగా ఉంటుందనీ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో రాణా పాత్రపరంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తారనీ, రాజకీయ వర్గాల్లో అసాధారణమైన పాపులారిటీ సంపాదించుకున్న ఆయనను ఎలాగైనా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారనీ, ఆ దిశగా కథాక్రమం ఉంటుందనీ తెలుస్తోంది.ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తోట తరణి కళాదర్శకత్వం, విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ హైలైట్స్ కానున్నాయి. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించిన ఆడియో ఇటీవలే విడుదల కాగా, ప్రమోస్ ఇప్పటికే ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. దగ్గుబాటు ఫ్యామిలీ హీరో అయిన వెంకటేష్ స్టయిల్ లోనే 'లీడర్'గా వస్తున్న రానా కూడా తెలుగు పరిశ్రమను ఏలుతారా అనేది డిసెంబర్ 21న తేలనుంది. అదే రోజు ఇటు క్రిస్మస్, అటు సంక్రాంతి కలిసొచ్చేలా థియేటర్ల ముందుకు 'లీడర్' రానున్నాడు.

No comments:

Post a Comment