క్రిస్మస్ కానుకగా 'అదుర్స్'

ఈసారి సంక్రాంతి బరిలో అగ్రహీరోలైన బాలకృష్ణ 'సింహా'తోనూ, నాగార్జున 'మోసగాడు', వెంకటేష్ 'ఓం నమో వెంకటేశ' చిత్రాలతో పోటీపడేందుకు సిద్ధపడుతుండటంతో యువహీరోలు డిసెంబర్ రేసులో దిగుతున్నారు. నిర్మాత డి.సురేష్ బాబు తనయుడు రానా హీరోగా పరిచయమవుతున్న 'లీడర్', విష్ణు 'సలీమ్' డిసెంబర్ నెలాఖరును టార్గెట్ చేసుకోగా, ఈ సీజనలో భారీ అంచనాలున్న ఎన్టీఆర్ 'అదుర్స్' చిత్రం సైతం ఇదే తరుణంలో రిలీజ్ కు సన్నద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.తొలుత 'అదుర్స్' చిత్రాన్ని సంక్రాంతి రేసులో దింపాలని చిత్ర దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఎన్టీఆర్ కు సంక్రాంతి రీలీజ్ లు అచ్చిరాలేదు. 'ఆంధ్రవాలా', 'నాగ', 'నా అల్లుడు' చిత్రాలు ఫ్లాపులు చవిచూశాయి. అయితే చిత్ర దర్శకుడు వినాయక్ కు సంక్రాంతి రిలీజ్ లు కలిసొచ్చాయి. ఆయన తీసిన 'లక్ష్మి' సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ అయింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని క్రిస్మస్, సంక్రాంతి కలిసొచ్చేలా డిసెంబర్ 25న రిలీజ్ తేదీని అనుకుంటున్నారు. అదే నెల మొదటివారంలో భారీ ఎత్తున ఆడియో వేడుక నిర్వహించనున్నారు. దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనీ, ఆడియో ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమనీ తెలుస్తోంది. 'ఆంధ్రావాలా' తర్వాత ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం విశేష కాగా, గ్లామర్ తారలైన నయనతార, షీలా ఆయనకు జంటగా నటించారు. కామెడీ పార్ట్ ను బ్రహ్మానందం భుజాన వేసుకున్నారు. వైష్ణవీ ఆర్ట్స్ పతాకంపై కొడాలి నాని సమర్పణలో వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.

No comments:

Post a Comment